మన పండుగలు

  హనుమజ్జయంతి
    హమునజ్జయంతి పర్వదినాన్ని పల్లెలు, పట్టణాలు అను భేదం లేకుండా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ప్రతీ ఒక్కరూ అత్యంత భక్తి శ్రధ్దలతో నిర్వహిస్తారు.ఈ పర్వదినం రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే సకల సిద్దులు చేకూరి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పురోహితులు చెబుతున్నారు.ఈ రోజున ఆంజనేయ స్వామి దేవాలయాల్లొ భక్తులు తమలపాకులతో పూజను నిర్వహిస్తారు.
పూజా విధానం -
    పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి.పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి.

హనుమంతుని జన్మ వృత్తాంతం -
    మునులను,ప్రజలను అనేక భాదలకు గురిచేస్తున్న రాక్షసుల సంహారము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు విడివిడిగా ఏ ఒక్కరికీ సాధ్యపడుటలేదు. విష్ణుమూర్తి ‘ముగ్గురి తేజము’ను కలిపి ఈశ్వరునకు ఇచ్చాడు. దానిని శివుడు మింగుతాడు. శివశక్తిని పార్వతీదేవి భరించలేక అగ్నిహోత్రునకు ఇచ్చింది. దానిని అగ్ని భరించలేక వాయుదేవునకు ఇచ్చాడు. మహాబలపరాక్రమవంతుడైన కుమారుని కొరకు వేంకటాచలమునందు అంజనాదేవి తపస్సు చేస్తోంది. వాయుదేవునకు ఆమెపై అనుగ్రహం కలిగి శివతేజస్సును పండుగా మలిచి అంజనాదేవికి ప్రసాదించాడు.ఆ తేజస్సు మూలంగా జన్మించిన అత్యంత బలశాలే హనుమంతుడు.