మన పండుగలు

        
     ఉగాది అంటే నూతన సంవత్సర ఆరంభపు పండగ. దీని తొలి రూపము యుగాది.యుకారాది పదముల ఉచ్ఛారణ తెలుగు వారి సాంప్రదాయములకు విరుద్ధము. కాబట్టి ఉగాదిగా రూఢి అయినది.


     ఉగాది మనకు ప్రధానమైన మొదటి పండుగ. చాంద్రమానమును అనుసరించువారందరికి చైత్ర శుద్ధ పాడ్యమి - ఉగాది నాడే నూతన సంవత్సరము. ఉగాది రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తరువాత తల స్నానము చేసి శుభ్రమైన వస్తాలను ధరించి దేవుడి మందిరమున ఆ సంవత్సరపు పంచాంగము నుంచుతారు. పంచాంగమునకు ఆ సంవత్సరపు అధిదేవతను షోడశోపచారములతో పూజిస్తారు. ఆరు రుచులతో (తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు....కొత్త బెల్లము, చింతపండు, ఉప్పు, మామిడి పిందెలు,పచ్చి మిరపకాయలు, వేప పూత) కూడిన ఉగాది పచ్చడిని నివేదన చేసి, ఇంటిల్లిపాది ఉగాది పచ్చడిని సేవిస్తారు. (తింటారు)

    సాయం సమయమున కొత్త బట్టలు ధరించి దేవాలయములందు జరుగు పంచాంగ శ్రవణము చేస్తారు. ఆ సంవత్సరము నందలి మంచి చెడులను, కందాయ ఫలములను, ఆదాయ ఫలములను, స్ధూలంగా ఆ ఏడాది లో తమ భావిజీవిత క్రమము తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోటానికి ఇష్టత చూపుతారు.ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు.
షడృచులు - ఆరు రుచులు -
     అవి: తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు

ఉగాది పచ్చడికి కావలసినవి -
     కొత్త బెల్లము, చింతపండు, ఉప్పు, మామిడి పిందెలు,పచ్చి మిరపకాయలు, వేప పూత