సేంద్రీయ వ్యవసాయం

ప్రస్తుతం వ్యవసాయరంగాన్ని పర్యావరణ మార్పులతోపాటు, విపరీతమైన చీడపీడలు కునారిల్లజేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి తోడు రుతుపవనాల దోబూచులాట కారంణంగా, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డి విరుస్తున్న సంగతి కూడా అనుభవైకమే. అయితే విపరీతంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల చీడపీడలను నాశనం చేసే రైతుమిత్రులైన జంతువులు నశించిపోవడంతో మరిన్ని తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయి. వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ శాస్తవ్రేత్తలు వీటికి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు వీలుగా పరిశోధనలు చేపట్టారు. ఎప్పుడైనా ప్రకృతిలో జంతువులు, వృక్షాల మధ్య సహజసిద్ధమైన సమతుల్యతను కొనసాగిస్తే తప్పనిసరిగా పంటలను చీడపీడల బారినుంచి కాపాడుకోవచ్చని వారి అధ్యయనంలో తేలింది.

ఇందుకు సేంద్రీయ వ్యవసాయాన్ని మించిన మరో ఉత్తమ మార్గం లేదని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఈ విధానంలో పంటలకు నష్టం వాటిల్లజేసే క్రిమి కీటకాలు, వాటి శత్రువులు, సేంద్రీయ వ్యవసాయ విధానం... ఈ మూడింటి మధ్య కొనసాగే సమతుల్యత కారణంగా ఏజీవి తన జనాభాను విపరీతంగా వృద్ధి చేసుకొనే పరిస్థితి ఉండదు. దానివల్ల పంటలో కూడా ఒక విధమైన సమతుల్యత ఏర్పడుతుందని వారు గుర్తించారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన కీటకశాస్తవ్రేత్త డేవిడ్ క్రొవ్‌డర్ మాట్లాడుతూ, ‘జాతుల మధ్య సమతుల్యత సాధించినప్పుడు ప్రకృతిలో అవి తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించగలుగుతాయి,’ అని అన్నారు. అటువంటి పరిస్థితిలో ఏ ప్రత్యేక జాతి కూడా మిగిలిన వాటిపై తమ ఆధిపత్యాన్ని చూపలేవని కూడా ఆయన స్పష్టం చేసారు. అందువల్ల ఒక జీవావరణ వ్యవస్థలో అన్ని రకాల జీవులను పరిరక్షించినప్పుడే సమతుల్యత సాధ్యమవుతుందని డేవిడ్ నొక్కి చెబుతున్నారు. ఫ్రాన్స్‌లో ఆలుగడ్డ ఉత్పత్తిని సుస్థిరంగా కొనసాగించాలంటే, కీటకాలు, వాటి శత్రవుల మధ్య సమతుల్యతను సాధించే విధంగా జీవావరణ వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అక్కడి వ్యవసాయ నిపుణులు గుర్తించారు. ఆవిధంగా చేయడం ద్వారానే కీటకాల నియంత్రణ సాధ్యమవడాన్ని వారు గమనించారు. సంప్రదాయంగా అనుసరిస్తున్న కీటక నియంత్రణ పద్ధతుల వల్ల, కొన్ని రకాల జీవులు నశించిపోయి, మరికొన్ని రకాలు విపరీత సంఖ్యలో వృద్ధి చెందడానికి అవకాశముంది. ఇందుకోసం వారు వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన కొలంబియా మైదాన ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు అనుసరించే ప్రాంతాలు, సంప్రదాయంగా అనుసరించే కీటకనాశనుల వాడకం, రసాయన ఎరువుల వినియోగం జరిగిన ప్రాంతాల మధ్య ఆలుగడ్డ పంట ఉత్పత్తిలో గణనీయమైన తేడా కనిపించింది. ఎందుకంటే ఎక్కడైతే పర్యావరణ వ్యవస్థ సుస్థిరంగా ఉన్నదో అక్కడ అన్ని రకాల జీవుల జనాభాలో ఒక సమతుల్యత సాధ్యమయింది. అందువల్లనే ఆయా ప్రాంతాల్లో దిగుబడులు అత్యధికంగా వచ్చాయి. అందువల్ల సేంద్రీయ వ్యవసాయం వల్లనే అధిక దిగుబడులు సాధించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ కూడా చేపట్టవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.