పెట్రోలు ధర పెంపుతో దేశమంతా భగ్గుమంటుంటే తాజాగా డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్ ధరలపైనా ప్రభుత్వం దృష్టిపెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా వీటి ధరలనూ సవరించాలని భావిస్తోంది. ఈ అంశంపై ఏడాది నుంచి అధీకృత మంత్రుల బృందం భేటీ కాకపోవడంతో త్వరలో సమావేశం నిర్వహించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ తలపెట్టింది. అంటే... రేపోమాపో వాటి ధరలు కూడా మోతెక్కే ప్రమాదం ఉందన్నమాటే.
అయితే.. డీజిల్, గ్యాస్, కిరోసిన్‌ల ధర పెంచితే ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని, అందువల్ల అప్పుడే ఇలాంటి ఆలోచన వద్దని కాంగ్రెస్ వర్గాలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. మరోవైపు రికార్డుస్థాయిలో పెట్రోలు ధర పెంచడంపై భగ్గుమంటున్న విపక్షాలు ఇప్పటికే నిరసన తెలుపుతున్న నేపథ్యంలో 31న భారత్‌బంద్‌కు ఎన్డీయే, అఖిలభారత నిరసన దినం నిర్వహణకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. ప్రతిపక్షాల నుంచే కాకుండా ప్రజల నుంచి ఆగ్రహం వెల్లువెత్తడం గమనించిన ప్రభుత్వం కాస్త వెనక్కితగ్గే యోచనలో ఉంది. ప్రస్తుతం టర్క్మెనిస్థాన్లో ఉన్న జైపాల్ రెడ్డి తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని గురువారం తిరిగివచ్చారు.
శుక్రవారం ఆయనతో చర్చించిన తర్వాత లీటరుకు రూ.3-5 వరకు తగ్గించాలని కాంగ్రెస్ వర్గాలు కోరుతున్నాయి. అయితే, రూ.2.50 వరకు తగ్గించి ఆగ్రహజ్వాలలను కొంతయినా చల్లార్చే వీలుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. |